'పటాన్ చెరు వరకూ మెట్రో'?
అయితే, జంటనగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ఇతర సౌకర్యాల కల్పన కోసం అవసరమయ్యే మరో 10 వేల కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం నుంచి మంజూరు చేయించాల్సిందిగా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే కృషిలో రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం నుంచి చేయూతనిప్పించాలని జైపాల్ రెడ్డిని వైఎస్ కోరారు.
ఒక్క హైదరాబాద్ నగరంలో 79 వేల ఇళ్ళు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణానికి 17 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ళుగా కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం కూడా సామాన్యుల అభివృద్ధి, సంక్షేమం కోసమే అహరహం కృషిచేస్తున్నాయని చెప్పుకున్నారు. సామాన్యుల ప్రతి అవసరాన్నీ తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ లో వైద్యం, విద్య లాంటి ప్రతి సౌకర్యాన్నీ కల్పిస్తున్నామన్నారు. నిరుపేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో రెండు లక్షల రూపాయల వరకూ పూర్తి ఉచితంగా వైద్య సౌకర్యం అందించే 'రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకా'న్ని కేవలం ఆంధ్రరాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నామని చెప్పారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి 30 వేల రూపాయల వరకూ ఫీజు తీసుకోకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా ఈ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు.
మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ పునరుద్ఘాటించారు. భారతదేశం మొత్తంలో మహిళలకు అందిస్తున్న తక్కువ వడ్డీ రుణాల్లో 55 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇన్ని రకాల మేళ్ళు చేస్తున్నందువల్లే 2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని వైఎస్ కృతజ్ఞతలు తెలిపారు. మోసపూరిత వాగ్దానాలు చేసిన పార్టీని, సినిమానటులతో రంగులు చూపించిన పార్టీలను విశ్వాసం లోకి తీసుకోకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలకు మరిన్ని మేళ్ళు చేయడానికే కంకణం కట్టుకున్నామన్నారు. గత ఐదేళ్ళలో తాము చేసిన అభివృద్ధి పనులను మెచ్చుకుని మరోసాి అధికారం అందించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదేళ్ళూ మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు.
అంతకు ముందు జిహెచ్ ఎంసి పరిధిలో ముఖ్యమంత్రి చేపట్టిన పర్యటనలో భాగంగా ఎర్రగడ్డలోని జిటిఎస్ కాలనీలో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అదే ప్రాంతంలోని చత్రపతి శివాజీ నగర్ చేరుకొని ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు.
Pages: -1- 2 News Posted: 15 July, 2009
|