కృష్ణకు భారీగా వరద
కేవలం 12టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జూరాల జలాశయం వేగంగా నిండుతుందని దాంతో దిగువన ఉన్న శ్రీశైలంకు నీటి విడుదల వెంటనే చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తుంగభద్ర, కృష్ణానదులు కలిసి శ్రీశైలం జలాశయానికి నీటిని చేరుస్తాయని ప్రస్తుతం ఈ రెండు నదుల్లో కొనసాగుతున్న ప్రవాహం కారణంగా శ్రీశైలం జలాశయం నిండటం పెద్ద కష్టమేమీ కాదని వారు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత ప్రవాహం మరో 10 రోజులు కొనసాగితే నీటి మట్టం 854 అడుగులకు చేరుతుందని అది జరిగితే శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసి, కేసీ కెనాల్ కు సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేయవచ్చని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 800 అడుగుల లోపు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలన్న ఆందోళనతో ఉన్న ప్రభుత్వం తుంగభద్ర, కృష్ణానదుల్లో కొనసాగుతున్న నీటి ప్రవాహాన్ని గంటగంటకు తెలుసుకుంటూ అవసరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే రాయలసీమ, నెల్లూరు జిల్లా రైతులు, ప్రజలకు, చెన్నై నగర వాసులకు తాగునీటి అవసరాలకు నీరు లభించి కొంతమేర ఇబ్బందులు తొలగవచ్చని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఈ నీటి ప్రవాహం ఏ మేరకు ఉంటుందనేది రెండు, మూడు రోజుల తరువాత కాని తెలియదని అధికారులు పేర్కొంటున్నారు.
Pages: -1- 2 News Posted: 22 July, 2009
|