'లక్ష్మీ' నివాసంలో బాలయ్య హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ బుధవారంనాడు లక్ష్మీపార్వతిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. సుమారు గంటసేపు వారి ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయి. అయితే, ఈ భేటీలో తమ ఇద్దరి మధ్యా కుటుంబ విషయాలు, గత స్మృతులు నెమరు వేసుకున్నామని లక్ష్మీపార్వతి మీడియాకు తెలిపారు. తన బిడ్డ బాలయ్యబాబు ఫోన్ చేసి తనను చూసేందుకు వస్తున్నానని చెప్పగానే తాను సంతోషంతోను, ఆనందంతోనూ అవాక్కయ్యానని ఆమె చెప్పుకున్నారు. బాలకృష్ణ కుటుంబాన్ని ఉగాది రోజున తన ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పారు. బాలకృష్ణ చాలా మంచివాడని, అన్ని విషయాల్లోనూ మంచి పరిపక్వత కనబరుస్తాడన్నారు. బాలకృష్ణ తన వద్దకు వచ్చిన సందర్భంగా తాను చాలా ఉద్వేగంగా ఫీలయ్యానన్నారు. అయితే, తమ మధ్య రాజకీయ సంబంధమైన చర్చలేవీ జరగలేదన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, 'మా అమ్మను చూసేందుకు వచ్చాను. ఇకపైన కూడా వస్తూనే ఉంటాను. ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవడానికే వచ్చాను. మా మధ్య అపోహలు తొలగిపోయాయం'టూ బాలకృష్ణ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఎన్టీఆర్ ఆశయాలను నిజం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ పేరున ఒక చిరస్మరణీయమైన కార్యక్రమం నిర్వహించానుకున్నామని లక్ష్మీపార్వతి అన్నారు. త్వరలోనే ఓ మంచి కార్యాచరణతో బాలకృష్ణ, తాను మీడియా ముందుకు వస్తామన్నారు. ఎన్టీఆర్ పేరుతో ఆయన సామాన్లను భద్రపరుస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి చేయాలని బాలకృష్ణ నిశ్చయంతో ఉన్నారని లక్ష్మీపార్వతి సూచనప్రాయంగా తెలిపారు.
కాగా, ఎన్టీఆర్ మరణించిన ఇన్నేళ్ళకు లక్ష్మీపార్వతితో బాలకృష్ణ భేటీలో ఏదో అంతరార్థం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లక్ష్మీపార్వతిని రెండో పెళ్ళిచేసుకున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినప్పటి నుంచీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా పరిగణించలేదు. ఇన్నేళ్ళకు బాలకృష్ణ ఆమె నివాసానికి రావడం వెనుక ఆస్తుల తగాదాలకు సంబంధించిన కోర్టు కేసుల అంశమో లేక చంద్రబాబు వ్యూహమో ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి తనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయినా, ఆస్తుల విషయంలో, ఎన్టీఆర్ మెమోరియల్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినా లక్ష్మీపార్వతి ఏనాడూ వారిని దూషించలేదు. తప్పు పట్టలేదు. తన భర్త ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం అంటూ అమె నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాయలో పడి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మోసపోతున్నరంటూ వాపోయారు. అలాగే, బాలకృష్ణ ఇంటిలో కాల్పుల ఘటన, ఆ సంఘటనలో గాయపడిన బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పుడు లక్ష్మీపార్వతి వెళ్ళి పరామర్శించి వచ్చారు.
News Posted: 10 March, 2010
|