పరిశ్రమల రక్షణకు టాస్క్ ఫోర్సు హైదరాబాద్ : పరిశ్రమలకు రక్షణకు కల్పించేందుకు ప్రభుత్వం ఇండస్ట్రీ సెక్యూరిటీ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేకించి కృష్ణప్రసాద్‌ను నోడల్ అధికారిగా నియమించింది. ప్రభుత్వం అధికారికంగా టాస్క్ఫోర్సును ఏర్పాటు చేస్తూ విధివిధానాలతో ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య టాస్క్ఫోర్సుపై సమావేశం నిర్వహించి ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇండస్ట్రీస్ టాస్క్ఫోర్సు ఐటి, వివిధ పెద్ద కంపెనీలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య శాఖ, ఇన్‌ఫర్మేషన్ టెక్మాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ, ఇండస్ట్రీస్ కమీషనర్, ఎసిఐఐసి, ఎపిఎస్‌ఆర్‌టిసి, సివిల్ సప్లయిస్, జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ మెట్రోడవలెప్‌మెంట్ అధారిటీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుంది.
ఈ శాఖల నుంచి కూడా నోడల్ ఆఫీసర్‌కు అవసరమైన సహాయచర్యలు ఇవ్వాలని కోరారు. ప్రతి పరిశ్రమ, ఐటి కంపెనీల నుంచి ఒక్కో ప్రతినిధిని నోడల్ ఆఫీసర్‌తో ప్రత్యేకించి తరచు మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎసిఐఐసి, దాని పారిశ్రామిక వాడలు, యూనిట్లు, ఐటి, ఐటి ఆధారిత పరిశ్రమలు ఉన్నచోట్ల టాస్క్ఫోర్సు అవసరమైనప్పుడు వస్తే వారికి తగిన లాజిస్టిక్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. వాహనాలే కాకుండా, అవసరమైన సిబ్బందిని కూడా సమకూర్చాలని సూచించింది.
అలాగే విశాఖ, విజయవాడలకు కూడా టాస్కఫోర్సును విస్తరించాలని ఆయా ప్రాంతాన కంపెనీల నుండి ఒత్తిడి పెరుగుతోంది. విశాఖ, విజయవాడలకు చెందిన ఐటీ కంపెనీలు ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల చేటుచేసుకున్న ఉద్యమాల్లో తమ ఆస్తులకు నష్టం వాటిల్లిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.
News Posted: 10 March, 2010
|