'గోపి గోపిక గోదావరి' రివ్యూ
వంశీ పేరు చెప్పగనే గోదావరి గలగలమంటుంది. పురివిప్పి నాట్యమాడుతుంది. సిగలో సోయగాలను తురుముకుని పరవశించిపోతుంది.గోదావరికీ దర్శకుడు వంశీకి ఉన్న విడదీయరాని బంధమిది. పడవలు, తెరచాపలు, లాంచీలు, నిత్యం రాకపోకలతో జనాలు చేసే సందడి, గోదావరిని నుదిట పాపిడిగా దిద్దుకున్న పాపికొండల సోయగాలు ఇవన్నీ వంశీని ప్రభావితం చేసినట్టుగా మరే దర్శకుడిని ప్రభావితం చేసి ఉండకపోవచ్చు. అందుకే వంశీ నుంచి ఆ తరహా చిత్రాలను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ కోరుకుంటూనే ఉన్నారు. గోదావరిపై తనకున్న మక్కువను దర్శకుడు ఈసారి మరింత ఎక్కువగా చాటుకున్నారు. ఏకంగా గోదావరిని టైటిల్ లో చేర్చి కీలక పాత్ర కూడా కట్టబెట్టారు. 'గోపి గోపిక గోదావరి' అంటూ తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండున్నర గంటల నిడివిలో సగానికి పైగా సినిమా గోదావరి చుట్టూనే తిప్పారు. విలనీ పాత్రలతో పాపులర్ అయిన నటులను కామెడియన్లుగా చేసి బోలెడంత వినోదం పంచడంలో సిద్ధహస్తుడైన వంశీ ఇటీవల తన ట్రెండ్ మార్చుకున్నట్టు అనిపించినా ఈసారి మాత్రం మళ్లీ తనదైన ట్రేడ్ మార్క్ హ్యూమర్ ను ఆశ్రయించారు. 'గోపి-గోపిక కలవకపోతే గోదావరి కంటపెడుతుంది' అంటూ టైటిల్ కు న్యాయం చేసే ప్రయత్నమూ చేశారు. అయితే ఎంచుకున్న స్టోరీలైన్ పాతదే కావడంతో విశ్రాంతి తర్వాత కథాగమనం ప్రేక్షకుడు ఊహించడం కష్టం కాదు. తెలుగువారికి గోదావరితో ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకుని...టైటిల్ తోనే క్యూరియాసిటీ నింపిన వంశీ ఆ అంచనాల తీరానికి 'గోపి గోపిక గోదావరి'ని చేర్చారా లేదా అనే ముచ్చట్లలోకి వెళితే...
గోపిక (కమలిని ముఖర్జీ) సేవాభావం ఉన్న డాక్టర్. 'ఫార్ కార్నర్స్ హాస్పిటల్' పేరుతో గోదావరిలోనే ఓ మొలైల్ ఆసుపత్రి నడుపుతూ ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంటుంది. గోపిక తరహాలోనే ఓ మొబైల్ ఆసుపత్రి నడపాలనే ఆశయంతో శ్యామ్ ప్రసాద్ (కల్యాణ్) అనే మరో యంగ్ డాక్టర్ ఆమెను కలుసుకుంటాడు. గోపికను తొలిచూపులోనే ప్రేమించిన శ్యామ్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన కూడా చేస్తాడు. అయితే వృతిపరంగా తాను సాధించాల్సినది చాలా ఉందనీ, పెళ్లంటూ చేసుకుంటే అతని గురించే మొదటిగా ఆలోచిస్తాననీ గోపిక సమాధానమిస్తుంది. గోపికకు హైద్రాబాద్ లో ఉమ అనే ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఊహించని విధంగా ఉమ ఆత్మహత్య చేసుకుంటుంది. ఉమ పోగొట్టుకున్న సెల్ ఫోన్ గోపి (వేణు) అనే స్టేజ్ సింగర్ కు దొరుకుంది. దానిని తిరిగి ఉమకు ఇవ్వడానికి వెళ్లిన గోపికి ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుస్తుంది. ఆ క్రమంలోనే గోపి-గోపిక ఫోనులో సంభాషించుకుంటారు. ఉమ గుర్తుగా ఆ సెల్ ఫోన్ ను గోపికకు అతను పంపుతాడు. అలా ఫోను సంభాషణల్లోనే గోపి-గోపిక ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. శ్యామ్ కు గోపికను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న ఆమె తల్లికి (జయలలిత) గోపి-గోపికల ప్రేమ వ్యవహారం తెలుస్తుంది. ఎలా ఉంటాడో తెలియని గోపిని ముందు తాను చూసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకుంటానని తల్లి తేల్చిచెబుతుంది. దాంతో గోపికను కలుసుకునేందుకు గోపి పోలవరం బయలుదేరుతాడు. అయితే దారిలో కొందరు దుండగులు గోపి తలపై బలంగా కొట్టి గోదావరిలో పడేస్తారు. గోపి పరిస్థితి ఏమైంది? గోపికను కలుసుకున్నాడా? వారి ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా కథ.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|