'ఆంజనేయులు' రివ్యూ
చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజిన్ల వరకూ అందరికీ చిరపరిచితమైన పేరు ఆంజనేయులు అలియాస్ అంజి. ఇంటింటికీ ఓ అంజి కనిపిస్తుంటాడు. రామాలయాలు, హనుమాన్ మందిరాలు లేని ఊళ్లు కనబడవు. వీర హనుమాన్ సాహసాలన్నా, చిన్నప్పటి అల్లరి చేష్టలన్నా, లంకాదహన కాండ అన్నా ఇష్టపడని వాళ్లెవరుంటారు. ఇవే ఇన్ గ్రేడియంట్స్ పలు తెలుగు సినిమాలకు ఇతివృత్తాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంజి...శ్రీ ఆంజనేయం...అంజనీపుత్రుడు వంటి టైటిల్స్ తో కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిజానికి వీటన్నింటికీ ఎంతో కొంత ఫాంటసీ జోడించారు. అయితే ఇలాంటి హంగులూ అర్భాటాలు లేకుండా పూర్తిగా సోషలైజ్ చేసి...ఆంజనేయులు మనవాడే...కేరాఫ్ కొవ్వూరు అంటూ హ్యూమర్, యాక్షన్, లంకాదహన కాండను, ఒకింత సెంటిమెంట్ జోడించి పక్కా మాస్ ఫార్ములాతో 'ఆంజనేయులు' చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. నాటి ఆంజనేయుడు బ్రహ్మచారి అయితే ఈనాటి ఆంజనేయులు మంచి లవర్ కూడా. సెన్సార్ హ్యూమర్ మెండు. ఈ రెండూ లేకపోతే ఆ పాత్ర రక్తికట్టడం మాటెలా ఉన్నా ప్రేక్షకులకు 'కిక్' ఎక్కడొస్తుంది? సక్సెస్ 'కిక్'లో ఉన్న రవితేజ, ఆయనకు జోడిగా సక్సెస్ ఫుల్ నయనతారను రిపీట్ చేయడం ద్వారా 'ఆంజనేయులు'పై ఫిల్మ్ మేకర్స్ మొదట్నించీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే రేకెత్తించారు. 'ఆంజనేయులు' ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం...
కృష్ణమూర్తి మాస్టార్, లక్ష్మి దంపతుల (నాజర్, సన) ముద్దుల కొడుకు ఆంజనేయులు (రవితేజ). గుండెనిండా సాహసం, సెన్సాఫ్ హ్యూమర్ అతని సొంతం. హెచ్ఎంటివిలో జర్నిలిస్టుగా పనిచేస్తుంటాడు. ఒకరోజు ఎయిర్ టెల్ లో పనిచేసే అంజలి (నయనతార) అతనికి తారసపడుతుంది. తొలి చూపులోనే ఆంజనేయులు ఆమెపై మనసు పారేసుకుంటాడు. మొదట్లో వీడో మెంటల్ అనుకుని తప్పించుకుని తిరిగే అంజలి క్రమంగా అతని గుండె ధైర్యం, మాటకారితనం, తనెంటో ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసుకుని అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆంజనేయులు తల్లిదండ్రులు కూడా సిటీ వచ్చి తమకు కాబోయే కోడల్ని చూసుకుని మురిసిపోతారు. తిరుగు ప్రయాణంలో ఊహించని ఓ సంఘటన ఆంజనేయులు తల్లిదండ్రుల విషయంలో చోటుచేసుకుంది. కథ అక్కడ్నించి పలు మలుపులు తిరుగుతుంది. ఆంజనేయులు తన పేరును పవన్ గా మార్చుకుని సంఘ విద్రోహ శక్తుల ముఠాలో చేరుతాడు. ఒకవైపు వృత్తిధర్మం నెరవేర్చడం, మరోవైపు వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకోవడం ఆంజనేయులు టార్గెట్ అవుతుంది. ఆంజనేయులు ప్రవర్తన అర్థం కాని అంజలి అతనికి దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఆంజనేయులు పవన్ గా మారడం వెనుక అతని వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సంక్షోభం ఏమిటనేది సస్పెన్స్ పార్ట్. ఆంజనేయులు లంకాదహన కాండతో ప్రత్యర్థుల ఆట ఎలా కట్టించాడు? అంజలితో అతని ప్రేమకథ ఎలా సుఖాంతమైందనేది మిగతా కథ.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|