'మిత్రుడు' కథా కమామిషు!
యువరత్న బాలకృష్ణ సరైన హిట్ చూసి చాలా కాలమే అయింది. 'విజయేంద్ర వర్మ', 'మహారథి'. 'అల్లరి పిడుగు' వంటి వరుస ఫ్యాపులతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలయ్య 'పాండురంగడు' చిత్రంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో మే 1న విడుదలకు సిద్ధమైన 'మిత్రుడు' చిత్రంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. కొన్ని పెర్ ఫెక్ట్ కాంబినేషన్లు ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇవాల్టి కొత్త దర్శకులలో ఉన్న టాలెంట్ కు ప్రేక్షకులు పట్టంకడుతున్న తరుణంలో ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడైన మహాదేవ్ దర్శకుడిగా తొలి వెంచర్ చేస్తుండటం, బాలకృష్ణ 'ఆదిత్య 369' వంటి హిట్ చిత్రాన్ని అందించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ గా నిర్మించడం, 'మిత్రుడు' అనే టైటిల్ లో ఉన్న సాఫ్ట్ నెస్ సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. దీనికితోడు ఇటీవల 'ద్రోణ' చిత్రంతో బోలెడంత గ్లామర్ ను వెండితెరపై పరచని ప్రియమణి ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా నటించడం గ్లామర్ ఎస్సెట్ అవుతోంది. వీటికితోడు బాలకృష్ణతో పలు మ్యూజికిల్ హిట్లు ఇచ్చిన మణిశర్మ సంగీతం అందించడంతో పాటు, గతంలో పలు హిట్ చిత్రాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అదించడం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. 'మిత్రుడు' కథా కమామిషులోకి వెళితే...
ప్రియమణికి జాతకంలో దోషం ఉంటుంది. ఆ ప్రకారం ఆమెకు పెళ్లయితే భర్తను పోగొట్టుకుని వైధవ్యం అనుభవించాల్సి ఉంటుంది. దీనికి తరుణోపాయంగా ప్రియమణి ఒక ఆలోచన చేస్తుంది. జీవితం గురించి పెద్దగా ఆశలు లేని ఒక అనాథను పెళ్లి చేసుకుని ఆ తర్వాత అతనికి విడాకులు ఇవ్వడం ద్వారా తనకు నచ్చిన వ్యక్తితో సెటిల్ కావచ్చు. ఆ ప్రయత్నాల్లోనే బాలకృష్ణ తారసపడతాడు. ఇద్దరికీ పెళ్లవుతుంది. అతనితో విడిపోవాలని ప్రియమణి ప్రయత్నిస్తుంది. అదే తరుణంలో ఆమెను ఆదుకునేందుకు ఒక మిత్రుడుగానే ఆమె జీవితంలోకి ప్రవేశించానని బాలయ్య చెబుతాడు. చివరకు కథ సుఖాంతమవుతుంది. గతంలో వచ్చిన ఒకటి రెండు చిత్రాలకు కొంచెం దగ్గర సామీప్యం ఉన్నట్టు కనిపిస్తున్నా మహాదేవ్ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కించారనీ, బాలకృష్ణ కెరీర్ కు ఈ చిత్రం మళ్లీ సరైన బ్రేక్ ఇవ్వడం ఖాయమనీ యూనిట్ నమ్మకంతో ఉంది. నిర్మాత సొంతంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా, మణిశర్మ ఓవరసీస్ రైట్స్ ను దక్కించుకోవడం ఈ సినిమాపై వారికున్న గట్స్ ను చాటుతుంది. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
Be first to comment on this News / Article!
|