హిమాలయాలకు విశాల్
కెరీర్ తొలినాళ్లలో ఒకటి రెండు ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ తర్వాత సక్సెస్ వస్తే ఆ మజానే వేరు. అయితే మొదట్లో సక్సెస్ లు చవిచూపి ఆ తర్వాత ఫెయిల్యూర్స్ లో కూరుకుపోతే మాత్రం ఎవరికైనా మింగుడుపడటం కష్టం. తెలుగు కుర్రాడే అయినా తమిళంలో మంచి డిమాండ్ సంపాదించుకున్న హీరో విశాల్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 'పొగరు', 'పందెంకోడి' వంటి చిత్రాలు అటు తమిళంలోనూ, అనువాదరూపంలో తెలుగులోనూ ఆమధ్య హిట్స్ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ విశాల్ కు సక్సెస్ ముఖం చాటేసింది. సుమారు ఆరు నెలల క్రితం విడుదలైన 'సెల్యూట్', నెలరోజుల క్రితం వచ్చిన 'పిస్తా' రెండు భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్స్ కావడంతో విశాల్ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం విశాల్ డ్రిపెషన్ స్టేట్ లో ఉన్నాడంటూ చెన్నై వర్గాలు ప్రముఖంగా చర్చించుకుంటున్నాయి.
'పిస్తా' రిలీజ్ కు కొద్దిరోజుల ముందే ముగ్గురు హీరోయన్లతో మళ్లీ సొంత బ్యానర్ జి.కె.ఫిలిమ్స్ పై ఓ చిత్రాన్ని ప్రకటించారు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. శ్రియ ఓ హీరోయిన్ గా కూడా ఎంపికైంది. ప్రస్తుతం ఆ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పటికీ విశాల్ మాత్రం మానసిక స్వాంతన, ప్రశాంతత కోసం హిమాలయాలకు బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. రజనీకాంత్ సక్సెస్, ఫెయిల్యూర్స్ తో లేకుండా తరచు హిమాలయాలకు వెళ్తుంటారు. ఇటీవల శ్రియ సైతం తీరికలేని బిజీ షెడ్యూల్స్ నుంచి కొద్దిపాటి తీరిక చేసుకుని హిమాలయాలకు వెళ్లి వచ్చింది. విశాల్ సైతం ఇటీవల తన శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టి సిక్స్ ప్యాక్ డవలప్ చేయడం వలన ముఖంలో 'గ్లో' తగ్గిందంటూ వాపోయారు. హిమాలయాల పర్యటన తర్వాత మళ్లీ విశాల్ లో మునుపటి ఉత్సాహం, ఆశించిన సక్సెస్ లు లభిస్తాయేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|