'జ్యోతిలక్ష్మి చీర కట్టింది..చీరకే సిగ్గేసింది' అనే పాట అప్పట్లో పాపులర్ అయింది. ఎప్పుడూ చీరకట్టని జ్యోతిలక్ష్మి చీర కడిదే స్పెషాలిటీ ఉన్నట్టేగా. ఇప్పటి జనరేషన్ కు వస్తే...బ్లో-అప్ అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నమిత ఏదో ఒకటో అరో సన్నివేశాల్లో చీరతో కనిపిస్తే ఫరవాలేదు కానీ...సినిమా అంతా చీరతో కనిపిస్తే ఆమెకున్న గ్లామర్ ఇమేజ్ దెబ్బతినదూ? అభిమానులు బెంగపెట్టుకోరూ? అసలు నమితను డీ-గ్లామరైజ్డ్ చూపించాలనే ఆలోచనే సాహసంతో కూడుకున్నది. తమిళ దర్శకుడు తిరు అలాంటి సాహసమే చేస్తున్నారు. నిజానికి ఇది సాహసం అనే కంటే నమితను విలక్షణంగా చూపించే ప్రయత్నం అనడమే సబబుగా ఉంటుందని తిరు అంటున్నారు.
బొద్దుగా ముద్దుగా ఉండే నమిత ఈమధ్యనే తనను అజంతా, ఎల్లోరా శిల్పాలతో పోల్చుకుని తన ఎక్స్ పోజింగ్ పై ఓ పెద్ద లెక్చరే ఇచ్చేసింది. ఒంటికి పేపరు చుట్టుకున్నా ముఖంలో ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తే ఎబ్బెట్టుగా ఫీలవడమే ఉండదనీ చెప్పుకొచ్చింది. అలాంటి నమితను డీ-గ్రామరైజ్డ్ పాత్రకు ఒప్పించడం ద్వారా దర్శకుడు తిరు ఇప్పుడు అందరి దృష్టిలోనూ పడ్డారు. ఆసక్తికరంగా ఈ చిత్రానికి 'అళగాన పొన్నుదాన్' (అందమైన అమ్మాయి) అనే పేరు కూడా పెట్టారు. 'ఇందులో ఇంతకుముందెన్నడూ చూడని నమితను చూస్తారు' అని ఆయన నమ్మబలుకుతున్నారు. నమితను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ స్క్రిప్టు రాశారట. ఇందులో నమిత సినిమా అంతా చీరకట్టుతోనే కనిపించనుందట. తన ఆహార్యంతో చూపరులను కట్టిపడేసే నమితను చీరకట్టుతో చుట్టిపడేస్తే అభిమానులు చిన్నబుచ్చుకోరా అని అడిగితే 'సినిమాలో ఓ డ్రీమ్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశాను. ఆ సన్నివేశంలో నమిత గ్లామర్ దుస్తులు ధరిస్తుంది. అయితే ఏ మాత్రం ఒళ్లు కనిపించదు. ఆ డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉందని మాత్రం అంతా అంటారు' అంటూ ఓ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారాయన. నమిత న్యూ-లుక్ ను తమిళ తంబీలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చాడాలి. పనిలో పనిగా తెలుగులో ఎలాగూ ఆ సినిమా అనువదమవుతుంది.