'పులి' టాకీ పూర్తయింది
'జల్సా' చిత్రం విడుదలై ఏడాదిన్నర అయింది. పవన్ కల్యాణ్ మలి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగానే ఎదురూ చూస్తున్నారు. అందులోనూ 'ఖుషి' వంటి హిట్ తర్వాత దాదాపు తొమ్మిదేళ్లకు దర్శకుడు ఎస్.జె.సూర్య, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంలో భారీ అంచనాలే ఉన్నాయి. 'పులి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ 30 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎస్.జె.సూర్య ఆ విశేషాలను తెలియజేస్తూ, పులి ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆ పేరుతో వస్తున్న చిత్రంలో పవన్ క్యారెక్టర్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందనీ, కోరమీసాలతో కనిపించే పవన్ ను చూసి ఆయన అభిమానులు పులిని చూస్తున్న అనుభూతికి లోనవుతారనీ చెప్పారు. 'ఖుషీ' తర్వాత తమ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయనీ, ఆ అంచనాలను మించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనీ చెప్పారు. అలాగే పవన్ కు జోడిగా నిఖిషా పటేల్ ను పరిచయం చేస్తున్నామనీ, నిఖిషా గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తయిందనీ, తక్కిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ అన్నారు. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గిరీష్ కన్నాడ్, మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్య, ఆలీ, బ్రహ్మాజీ, కోవైసరళ తదితరులు నటించారు. బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|