క్రిటిక్స్ కు శ్రీకాంత్ లక్ష
హీరో శ్రీకాంత్ ఫిలిం క్రిటిక్స్ అసోయేషన్ కు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. 'మహాత్మ' చిత్రంతో శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఫిలిం క్రిటిక్స్ అసోయేషన్ ఆయనను సన్మానించి, జ్ఞాపికను బహుకరించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ 'మీట్ ద ప్రెస్' కార్యక్రమం ఏర్పాటు చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభు, ప్రధాన కార్యదర్శి బి.జయ, ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కోశాధికారి సూప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంత్ మంచి నటుడే కాకుండా అజాత శత్రువనీ, స్నేహశీలి అనీ, పాత్రికేయులంటే ఎంతో గౌరవమున్న వ్యక్తనీ అసోసియేషన్ కు చెందిన పులవురు ఈ సందర్భంగా ప్రశంసించారు. శ్రీకాంత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ స్పందిస్తూ, నటుడిగా 100 సినిమాలు పూర్తి చేసుకున్న తరుణంలో తనను పిలిచి సన్మానించడం చాలా ఆనందంగా ఉందనీ, తన ఎదుగుదలలో పాత్రికేయుల పాత్ర ఎంతో ఉందనీ తన కృతజ్ఞతలు తెలిపారు. ఫిలిం క్రిటిక్స్ అసోయేషన్ కు లక్ష రూపాయల చెక్కుని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించక ముందు ఆయనతో ఎక్కువ సన్నిహితంగా ఉండే మీరు ఆ తర్వాత దూరమైనట్టు కనిపిస్తోందని అన్నప్పుడు రాజకీయాల గురించి తనకేమీ తెలియదనీ, వాస్తవానికి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నందువల్ల తరచు కలిసేందుకు వీలుకావడం లేదనీ శ్రీకాంత్ సమాధానమిచ్చారు. తన మనసులో ఆయనకు (చిరంజీవి) ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. 'మహాత్మ'ను 100వ సినిమాగా ఎంచుకోవడానికి కారణం అడిగినప్పుడు, వందో సినిమాను కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మకంగా తీయాలని అనుకుని ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు చెప్పారు. సమాజంలో జరుగుతున్నదే సినిమాలో చూపించామనీ, ప్రేక్షకాదరణ కూడా చాలా బాగుందనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|