'రక్తచరిత్ర'లో ప్రియమణి
అందం, అబినయం పుష్కలంగా ఉన్న ప్రియమణి ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడంతో అన్ని భాషల్లోనూ మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం జగపతిబాబుతో 'సాధ్యం' సినిమాలో ప్రియమణి నటిస్తోంది. ఇటీవలే మణిరత్నం 'రావణ్' చిత్రంలో అవకాశం అందిపుచ్చుకుని బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా మరో క్రేజీ చిత్రంలో నటించే అవకాశం ఆమెను వరించింది. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రక్తచరిత్ర' చిత్రంలో ప్రియమణి నాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో మద్దెల చెరువు సూరిగా నటిస్తున్న తమిళ హీరో సూర్య సరసన గంగుల భానుమతి పాత్రను ప్రియమణి పోషించనుంది.
పరిటాల రవి క్యారెక్టర్ ను వివేక్ ఒబెరాయ్ పోషిస్తుండగా, ఆయన సరసన బెంగాలీ నటి రాధిక ఆప్టే నటిస్తున్నారు. హిందీలో, తెలుగు, తమిళ భాషల్లో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినర్జీ పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది చివర్లో 'రక్తచరిత్ర', 'రక్తచరిత్ర 2' పక్షం రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో వర్మ ఉన్నారు.
Be first to comment on this News / Article!
|