నవంబర్ 6న 'అ ఆ ఇ ఈ'
హీరో శ్రీకాంత్ 100వ చిత్రంగా 'మహాత్మ' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన నటించిన 99వ చిత్రం 'అ ఆ ఇ ఈ' (అతను ఆమె ఇతను ఈమె) మాత్రం కారణాంతరాల వల్ల విడుదలలలో జాప్యం జరిగింది. కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ సరసన మీరాజాస్మిన్, సదా హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
కొత్తగా పెళ్లయిన కథానాయకుడు ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం సాగిస్తున్న తరుణంలో అతని జీవితంలోకి మరో అమ్మాయి ప్రవేశిస్తుందనీ, ఆ తరువాత ఎలాంటి పరిణామాలు సంభవించాయనేది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కిన హీరో కథలు కొత్త కానప్పటికీ దర్శకుడు తనదైన స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. సకుటుంబ సమేతకంగా చూడదగ్గ చిత్రమిదని అన్నారు. ఇందులో కౌష స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సునీల్, ఆలీ, ఏవియస్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, తనికెళ్ల భరణి, రఘబాబు, గిరిబాబు, తెలంగాణ శకుంతల, కోవై సరళ తదితరులు నటించారు. భాస్కర భట్ల పాటలు, ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|