ఇలియానాకు దాసరి చురక
దర్శకరత్న దాసరిని పరిశ్రమలో పెద్దాయనగా, మేస్త్రిగా ఎక్కువ మంది గౌరవిస్తుంటారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుంటారు. లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే బదులు పరభాషా హీరోయిన్లు, నటులతో తెలుగు పరిశ్రమను నింపేస్తున్నారని దాసరి విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా చాలనే ఉన్నాయి. అలాగే పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ చూపించని వారికి క్లాస్ తీసుకోవడంలోనూ ఆయన వెనుకాడరు. తాజాగా దాసరి ఆగ్రహాన్ని నటి ఇలియానా చవిచూసిన విషయం టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇంతకూ దాసరికి అంత ఆగ్రహం కలగడానికి కారణం ఏమిటంటే...సహజంగా ఆయన ఎదురు పడినప్పుడు గురువు గారూ ఆయనకు రెండు చేతులతో నమస్కారం పెట్టడం కానీ, కొందరైతే ఆయన పట్ల అభిమానంతో పాదాభివందనం చేయడం కానీ పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ఇలియానా దాసరి తారసపడినప్పుడు 'హాయ్' అంటూ చిలక పలుకులు పలికిందట. దాంతో దాసరికి చిర్రెత్తుకొచ్చింది.ఎదుట వ్యక్తులను ఎలా గౌరవించాలో నేర్చుకోమంటూ ఇలాయానాకు క్లాస్ పీకారట.
విష్ణువర్దన్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో 'సలీం' చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతోంది. మోహన్ బాబు కోరిక మేరకు దాసరి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుతున్న తరుణంలో ఇలియానా అక్కడకు వచ్చి దాసరిని హాయ్ అంటూ పలకరించింది. దాసరి వెంటనే స్పందిస్తూ 'ఇదేం పద్దతి అమ్మాయ్...మనకంటే పెద్దవాళ్లని గౌరవించే పద్దతి ముందు తెలుసుకో..' అంటూ మందలించారు. ఇలియానాకు షాక్ తిన్నంత పనైంది. వెంటనే తేరుకుని 'నేను ఇతరులను గౌరవించే పద్ధతి ఇదే' అంటూ తేల్చిచెప్పిందట. దాంతో మోహన్ బాబు జోక్యం చేసుకుని దాసరిని శాంతిపజేసే ప్రయత్నం చేశారట. పరభాషా హీరోయిన్లతో ఇదే చిక్కనీ, ఇక్కడి ప్రముఖుల గురించి, వారి పట్ల ఎలా ప్రవర్తించాలనే కనీస పరిజ్ఞానం కూడా వీరిలో ఉండదనీ, ఇందువల్ల పరిశ్రమ క్రమశిక్షణారాహిత్యం తలెత్తుతోందనీ యూనిట్ వర్గాలు ఈ సంఘటనపై విశ్లేషిస్తున్నాయి.
Be first to comment on this News / Article!
|