|
|
Articles: TP Features | మన భాషను ప్రేమిద్దాం - Site Administrator
| |
సున్నితమైన, సుతిమెత్తని, పాలబువ్వ లాంటి, మీగడతెరకల్లాంటి, వెన్నముద్దల్లాంటి మన మాటల్ని కఠినాతికఠినం చేసి, దాన్నే తెలుగుభాషగా జనం నెత్తిపై రుద్దిన చరిత్ర మనది. ఇప్పుడు మాత్రం ఇంగ్లీషు మాటలు లేకుండా మాట్లాడలేని స్థితి వచ్చినందుకు దురపిల్లుతున్నాం. ఒక్క ఇంగ్లీషు పదం కూడా వాడకుండా తెలుగులో రెండు నిమిషాలు మాట్లాడమని పరీక్షపెట్టి, బహుమతి ఆశపెట్టి, అందులో ఆ పిల్లవాడు రైలు అనో, బస్సు అనో, రోడ్డు అనో అన్నాడని అతడిని ఓడించడం తెలుగు భాషను ఉద్ధరించడమవుతుందా? ఉచ్ఛారణ అనే పదం పలకడంలో ఉచ్ఛారణ అనే పదం తెలుగు అవుతుందా? వెన్నుపూస కలవీ, వెన్నుపూస లేనివీ అని చెప్పడానికి సకసేరుకములు, అకసేరుకములు అని పాఠాలు నేర్పడం తెలుగు నేర్పడం అవుతుందా?
అన్ని విధాలుగా తెలుగు ప్రేమికులు, పండితులు, ఉద్యమకారులు, రచయితలు, కళాకారులు తాము మాట్లాడే ముందు, రాసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు అడుగేయవలసి ఉంది. మనం చేస్తున్న పని తెలుగుభాషకు, తెలుగుజాతికి నిజంగా మేలు చేస్తుందా అని ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది. అవసరమైన చోట ఇతర భాషల్నుంచి పదాల్ని తాత్కాలికంగానో, శాశ్వతంగానో తీసుకొని వాటిని మన భాషా లక్షణానికి తగ్గట్లు తీర్చిదిద్దుకోవడంలో తప్పేమీ లేదు. అయితే - మన భాషలో మనం పదాల్ని తీర్చిదిద్దుకొనే ప్రయత్నాన్ని చేస్తూనే ఆ పని చెయ్యాలి. మన భాష అంటే తెలుగే. సంస్కృతమో, హిందీయో, ఇంగ్లీషో కాదు.
తెలుగులో మనం మాండలికాల్నుండి, మన సాంస్కృతిక సంబంధాల నుండి ఏమీ దొరకనప్పుడు వాటి మీద ఆధారపడడం తప్పేమీ కాదు. ఆనాటి తిక్కన, అన్నమయ్య ఎంతో శ్రమచేసి తమ రచనల్ని తెలుగుదనంతో నింపారని మనకు తెలియదా?! అందులో నూరవ వంతైనా మనం చెయ్యలేమా? మనదైన జన సమూహాల్నుండి, మన వృత్తిదారుల నుండి, మన సామాజిక నిమ్నవర్గాల నుండి, మన గిరిజనుల నుండి, మన ఇరుగుపొరుగుల నుండి పదాల్ని సేకరించుకోలేనంత దివాళా తీశామా మనం?!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|