'ప్రయాణం' రివ్యూ
ఇవాల్టి జనరేషన్ ఆడపిల్లకు ప్రతీక హారిక (హారిక). నచ్చిన కెరీర్ ను ఎంచుకుని సొంత కాళ్లపై నిలబడాలనుకునే అమ్మాయి. మలేసియాలో హెయిర్ అండ్ బ్యూటీకి సంబంధించిన కోర్టు చేస్తుంటుంది. సగటు ఆడపిల్లల తరహాలోనే తనను ప్రాణాధికంగా ప్రేమించి, తన కెరీర్ కు అండగా నిలిచే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఆమెకు ఓ సంబంధం రావడంతో ఎంగేజ్ మెంట్ కోసం ఇండియా వెళ్లేందుకు తన మిత్రురాలితో కలిసి కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుంది. విమానాశ్రయంలో ఆమెకు ధ్రువ్ (మనోజ్) పరిచయమవుతాడు. ధ్రువ్ ఎంబిఏ పూర్తి చేస్తాడు. ప్రయాణాలు చేయడమంటే మహా సరదా. తన మిత్రులైన కైలాస్, రామన్ లతో కలిసి సింగపూర్ వెళ్లేందుకు మలేసియా ఎయిర్ పోర్ట్ కు వస్తాడు. అక్కడ హారిక కనిపించడంతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన మిత్రులకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటున్నట్టు చెబుతాడు. హారిక విమానం బయలుదేరడానికి మరో రెండు గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఆమెను ప్రేమలో పడేయడం, ప్రపోజ్ చేయడం, ఆమె ప్రేమను గెలుచుకోవడం అసాధ్యమని మిత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ధ్రువ్ తన పట్టుదల వదలడు. 2 గంటల వ్యవధిని 8 విభాగాలుగా విడగొట్టి...ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుంది. మొదటి 15 నిమిషాల్లో చూపులు కలపడం...తర్వాత దశలో మాటలు కలపడం, ఒక దశలో ప్రపోజ్ చేయడం...ఇలా ధ్రువ్ ప్రయత్నాలకు మిత్రులు సహకరిస్తుంటారు. ఓ దశలో హారిక ఎంగేజ్ మెంట్ కోసం ఇండియా వెళ్తున్న విషయం తెలుసుకున్నా తన ప్రయత్నాన్ని మాత్రం ధ్రువ్ వదిలిపెట్టడు. హారిక-ధ్రువ్ అభిరుచులు కలిసాయా? ఆమె ప్రేమను ధ్రువ్ గెలుచుకున్నాడా? అనేది తెరపై చూడటమే థ్రిల్లింగ్ గా ఉంటుంది.
ఎయిర్ పోర్ట్ లో కథ మొదలుపెట్టి అక్కడే కథకు ముగింపు ఇవ్వడం అనేది బహుశా తెలుగుతెరపై ఇదే మొదటిసారి ప్రయోగం కావచ్చు.
కె.బాలచందర్ 'అందమైన అనుభవం' చిత్రం ఈ సినిమాకి స్ఫూర్తి కావచ్చనే అభిప్రాయమూ కలుగుతుంది. అయితే దర్శకుడు తనదైన శైలిలో కథను అల్లుకుని స్క్రీన్ ప్లే ప్రధానంగా కథను నడపడం ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్లు క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతోందనేది
తొలి పదిహేను నిమిషాల్లోనే ఓ సాంగ్ లో చూపించడం ఆయన క్రియేటివిటీకి అద్దంపడుతుంది. అలాగే హీరోహీరోయిన్లు ఒకరినొకరు ఢీకొనే ఘట్టం చాలా సహజంగా, లవ్ ఎఫ్ ఫస్ట్ సైట్ కు సంబంధించిన రొమాంటిక్ ఘట్టంగా తెరకెక్కించడమూ అలరిస్తుంది. బ్రహ్మానందం, హీరో మిత్రుల మధ్య నడిచే కామెడీ సన్నివేశాల్లో మరింత డెప్త్ అవసరం.
నటీనటుల పరంగా మనోజ్ 'స్టీల్ ద షో' అని చెప్పక తప్పదు. నిన్నటి వరకూ వరుస ఫ్లాపులు ఇచ్చిన మనోజ్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించక మానదు. ఎక్కడా హీ(వీ)రోచిత విన్యాసాలు చేయలేదు. నటనలో, హావభావాల ప్రకటనలో ఎంతో మంచి ఈజ్ కనబరచారు. ఇవాల్టి తరం హీరోలంతా లవర్ బాయ్ పాత్రల నుంచి మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న తరుణంలో మనోజ్ ను లవర్ బాయ్ గా చూడటం ప్రేక్షకులకు నిజంగానే థ్రిల్ కలిగిస్తుంది. హారిక (తొలిపరిచయం) మొదట్లో కొత్తగా అనిపించినా పోనుపోనూ ప్రేక్షకులకు అలవాటు పడిపోయిన అమ్మాయిలా అనిపిస్తుంది. గ్లామర్ తో పాటు నటనపరంగానూ ఫరవాలేదని అనిపించుకుంటుంది. హారిక ఫ్రెండ్ గా చేసిన నటి కూడా తన పాత్రకు న్యాయంచేసింది. విదేశాలకు వెళ్లే రైతుగా ఎయిర్ పోర్ట్ లో కనిపించే బ్రహ్మానందం అడపాదపడా నవ్వించారు. అలాగే హీరో మిత్రులుగా చేసిన ఇద్దరూ వినోద ప్రధానంగా తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|