'పిస్తా' రివ్యూ
దర్శకుడు సభాపతికి ఇది తొలి చిత్రమే అయినా టెక్నికల్ గా గట్టి పట్టు కనబరచారు ఎటొచ్చీ కథ, కథనాలపై తగినంత కసరత్తు చేసినట్టు కనిపించదు. హీరో విలన్ ను ఢీకొని 'పిస్తా' అనిపించుకునే ఘట్టాలు కూడా ప్రేక్షకుల రియాక్షన్ కు నోచవు. ఈ తరహా ఇతివృత్తాలు చూసిచూసి బాగా జీర్ణించుకుపోయిన ఆడియెన్స్ కు విశ్రాంతి ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం కాదు. ఒక ఫైట్...పాట...మధ్యలో కామెడీ...ఇలా లెక్కలు వేసుకుని రొటీన్ 'కిచిడీ'కే దర్శకుడు పరిమితం కావడం వల్ల ఆయన నుంచి కొత్తదనం ఆశించిన వాళ్లకు సరైన 'కిక్' దొరకదు. ద్విభాషా చిత్రమైనా తెలుగు నేటివిటీ మిస్ కాకుండా చూసుకోవడం, తమిళ రైటింగ్స్ ఎక్కడా కనబడకపోవడం వంటి అంశాల్లో మాత్రం దర్శకుడు తగిన శ్రద్ధ చూపించారు.
విశాల్ పై 'పందెంకోడు' ప్రభావం ఇంకా పోలేదనిస్తుంది. ఇందులోని పలు ఫైట్స్ కూడా ఈ కోవలేనే ఉన్నాయి. రొమాంటిక్, కామెడీ టచ్ ఆయన పాత్రలో ఉన్నా యాక్షన్ సన్నివేశాలే డామినేట్ అయ్యారు. ఫైట్లు, డాన్స్ లలో విశాల్ బాగా రాణించారు. ఎటొచ్చీ మితిమీరిన ఎక్సర్ సైజుల వల్లనో ఏమో కానీ ముఖంలో తగినంత 'గ్లో' కనిపించడం లేదు. వాచకంలోనూ మెరుగులు పెట్టుకోవాలి. హెయిర్ స్టయిల్, కాస్ట్యూమ్స్ విషయంలోనూ రొటీన్ పంథానే అనుసరించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని 'పిస్తా' మరోసారి నొక్కిచెబుతుంది. శ్రియ 'సైజ్ జీరో' ఆహార్యంతో కొత్తతరం హీరోయిన్ల రేసులోనూ తన సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది.అయితే కేవలం నాలుగు డ్యూయెట్లు, సాదాసీదా సన్నివేశాలకే ఆమె పాత్ర పరిమితమైంది. నటనకు తగిన స్కోప్ లేదు. విశాల్-శ్రియ మధ్య 'లిప్ కిస్' సన్నివేశం ఎలాంటి 'హీట్' సృష్టించదు. ఓ కామెడీ సీన్ లో భాగంగానే కన్నుతెరచి మూసే లోగా ఈ దృశ్యం మాయమవుతుంది. ప్రకాష్ రాజ్ చాలా రోజుల తర్వాత మళ్లీ పూర్తి స్థాయి విలనీ పాత్ర పోషించి మెప్పించారు. సినిమా మొత్తం బ్లాక్ షర్ట్ తోనే ఆయన కనిపించడం విశేషం. గురు పాత్రధారి కిషోర్ తన పాత్రకు న్యాయం చేశారు. ఆయనలో నానాపటేకర్ పోలికలున్నాయి. హావభావాలు మెరుగుపరచుకుంటే మంచి నటుడిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఆలీ, తెలంగాణా శకుంతల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలను ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ లభిస్తోంది. ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, సాయాజీ షిండే పాత్రల పరిధి తక్కువ. సీనియర్ నటి గీత చాలాకాలం తర్వాత తెరపై కనిపించింది. అయితే సెంటిమెంట్ సన్నివేశాల్లో గుసగులాడుతున్నట్టు మాట్లాడటం అంత బాగాలేదు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|