'బాణం' రివ్యూ
దర్శకుడు చైతన్య దంతులూరి తాను ఎంచుకున్న (రాసుకున్న) సీరియస్ సబ్జెక్ట్ ను అంతే సీరియస్ గా హ్యాండిల్ చేయడంలో, చాలా సందర్భాల్లో తన ఉనికిని చాటుకోవడంలో కృతకృత్యుడయ్యాడని చెప్పొచ్చు. సబ్జెక్ట్ కు అనువు కాదని అనుకోవడం వల్లనో మరో కారణాల వల్లనో వినోదం, కమర్షియల్ మషాలాల జోలికి వెళ్లలేదు. సబ్జెక్ట్ పై ఆయనకు ఉన్న పట్టు చాలా సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు తండ్రీకొడుకుల సిద్ధాంతాలకు తగ్గట్టుగా చేగువెరా, భగత్ సింగ్ ఫోటోలను పక్కపక్కనే చూపించడం, 1989 కాలం నాటి ఘట్టాలను చూపించే సమయంలో అక్కటి థియేటర్ వద్ద అదే ఏడాది వచ్చిన 'గీతాంజలి' సినిమా పోస్టర్లు చూపించడం వంటివి విమర్శలకు తావులేని ఆయన ముందుచూపునకు నిదర్శనం. అయితే 1989 కాలం నాటి ఎఫెక్ట్ ను తీసుకుని రావడానికి దర్శకుడు మరింత దృష్టి సారించాల్సింది. విశ్రాంతి కార్డును మొదటి అధ్యాయం సమాప్తం (ఎండ్ ఆఫ్ ఛాప్టర్ 1) అని, మధ్యలో హీరో చావుబ్రతుకల మధ్య రైలు పట్టాల మీద పడి ఉన్నప్పుడు 'రెండో అధ్యాయం సమాప్తం' అని, శుభం కార్డుకు బదులు 'కొత్త అధ్యాయం ప్రారంభం' అని చూపించడం...'ఎండాఫ్ ఫస్ట్ పార్ట్, ఇన్ సర్ట్ సెకెండ్ డిస్క్'ను తలపించి కొత్తగా అనిపిస్తుంది. చివరి కార్డును బట్టి చూస్తే అంతవరకూ ఖాకీ డ్రెస్ వేసుకుని హీరో తన తదుపరి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా వస్తారనే సంకేతం కూడా ఇమిడి ఉండొచ్చు.
నారా రోహిత్ పాత్రను అండర్ ప్లే చేసి చూపించడం వల్ల హావభావాల ప్రదర్శనకు ఎక్కువ స్కోప్ కనిపించదు. ఒక యాక్షన్ హీరోకి కావాల్సిన ఫిజిక్, రొమాంటిక్ హీరోగా కనిపించగలిగిన ఫీచర్స్ మాత్రం ఉన్నాయి. వాచకంలో మంచి పెర్ ఫెక్షన్ ఉంది. డాన్సింగ్ స్కిల్స్ కు ఇందులో స్కోప్ లేదు. ఆయన ముఖంలో పవన్ కల్యాణ్ పోలికలు, ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ఫీచర్స్ కనిపించాయి. మునుముందు మరింత సబ్జెక్ట్ లు పడితే రాటుదేలుతారు. బ్రాహ్మణ యువతిగా వేదిక బ్యాలెన్స్ డ్ గా నటించింది. హోమ్లీ పాత్రలు మరిన్ని దక్కించుకోవచ్చు. సాయాజీ షిండే తన పాత్రకు నిండుతనం చెప్పారు. అడవుల్లో ఉన్నప్పుడూ జనజీవన స్రవంతిలోనే ఉన్నాననీ, ఇది లొంగిపోవడం కాదనీ, ప్రతి పనికి రిటైర్ మెంట్ ఉన్నట్టే తాను కూడా ఉద్యమం నుంచి రిటైర్ అయ్యాననీ గంభీరంగా చెబుతూ తన పాత్రకు (నమ్మిన సిద్ధాతం పరంగా కూడా) న్యాయం చేశారు. విలనీ పాత్రధారి రణధీర్ కూడా రాణించారు. ఆయనలో జె.డి.చక్రవర్తి పోలికలు కనిపిస్తాయి. సంగీతం మాస్టారుగా ఏవియస్ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించినా ఆయన నోట వెంట వచ్చిన 'ఉత్తినే' అనే ఊతపదం క్లిక్ అయింది. పోలీసు అధికారులుగా భానుచందర్, రాజీవ్ కనకాల చక్కగా ఇమిడిపోయారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|