'పిస్తా' రివ్యూ
'పిల్లకోడి కాదు...పందెంకోడి' అనేది విశాల్ ను ఉద్దేశించి ఓ కమెడియన్ నోట మాట వెలువడిన వెంటనే హీరో ఎంట్రీ ఇచ్చేస్తాడు. ప్రత్యర్థి ముఠా కయ్యానికి కాలు దువ్వుతుంది. అయినా ఫైటెందుకు? పాటేసుకుంటే పోలా? అని విశాల్ ప్రపోజ్ చేయగానే ఓ గ్రూప్ సాంగ్ పడిపోతుంది. కట్ చేస్తే...షరా మామూలుగా హీరో ఓ పని మీద పట్నం వెళ్లడం..అక్కడ ముఠాల మధ్య చిక్కుకోవడం..ఐదు నిమిషాలకో ఫైటు. విశాల్ తాజా చిత్రం 'పిస్తా' పోకడ ఇది. విశాల్ సినిమాలకు పదే పదే ఇలాంటి కథలు రాయడం కథకుల లోపమో, మూస ఫార్ములాకు భిన్నంగా విశాల్ ఆలోచించలేకపోవడమో కారణాలు అయి ఉండొచ్చు. బయట చిత్రాల విషయంలో హీరోలు పెద్దగా రిస్క్ తీసుకోలేకపోవచ్చు. అయితే సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నప్పుడు వైవిధ్యం కోసం ప్రయత్నించొచ్చు. విలక్షణ ఇతి వృత్తాలు ఎంచుకోవచ్చు. బహుముఖ ప్రతిని చాటుకునే క్యారెక్టర్లు పోషించనూ వచ్చు. అలాంటప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చినా వృత్తిపరమైన సంతృప్తి ఎంతో కొంత మిగుల్తుంది. ఇందుకు విశాల్ సన్నద్ధం కాకుండే 'పిస్తా' వంటి రొటీన్ ఫార్ములా చిత్రాలతో ప్రేక్షకులు మొనాటనీ ఫీలయ్యే అవకాశాలే పుష్కలం. 'పిస్తా' తీరుతెన్నుల్లోకి వెళితే...
మురళీ కృష్ణ (విశాల్) రామచంద్రాపురం కుర్రాడు. అతని అన్న రాంబాబు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. తల్లి (గీత) కోరిక మేరకు అన్న జాడ తెలుసుకునేందుకు విశాఖపట్నంలో మురళీకృష్ణ అడుగుపెడతాడు. అక్కడ సత్యప్రకాష్ (ప్రకాష్ రాజ్), గురు (కిషోర్ ) అనే రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటుంది. మురళీ కృష్ణ విశాఖలో అడుగు పెట్టగానే అతని కళ్ల ముందే గురు (కిషోర్) తన ప్రత్యర్థి ముఠా వ్యక్తిని కాల్చిచంపుతాడు. ఆ హత్యకు ప్రత్యక్ష సాక్షి మురళీ కృష్ణ కావడంతో సాక్ష్యం చెబితే చంపేస్తానని అతన్ని గురు బెదరిస్తాడు. ఇంకోవైపు సాక్ష్యం చెప్పకపోతే ప్రాణాలు తీస్తానని సత్యప్రకాష్ అతన్ని హెచ్చరిస్తాడు. మురళీ కృష్ణ తన స్నేహితుడు చిట్టిబాబు (ఆలీ) ఇంట్లో దిగుతాడు. అన్నయ్య కోసం వెతికే క్రమంలో అతనికి ఇందు (శ్రియ) తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు సత్యప్రకాష్, గురుల మధ్య వైరం ముదురుతుంటుంది. ఓ ఫోటో ఆధారంగా తన అన్నను కలుసుకునేందుకు మురళీ కృష్ణ ప్రయత్నం చేస్తుండగా ఆ ఫోటోలోని వ్యక్తిపై గురు దాడి చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మురళీకృష్ణ గురుతో తలబడతాడు. కథకు కీలకమైన మలుపు ఇక్కడే చోటుచేసుకుంటుంది. అదేమిటి? అసలు మురళీ కృష్ణ అన్న ఎవరు? తల్లికిచ్చిన మాటను మురళీకృష్ణ ఎలా నిలుపుకొన్నాడనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|