ఇంజనీరింగ్ చదివే అర్జున్ (నాని) పేరుకు తగ్గట్టే చాలా స్పీడ్. రఫ్ గా ఉంటాడు. బైక్ అంటే ప్రాణం. తనకంటూ ఓ బైక్ కావాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే తండ్రి (ఆహుతి ప్రసాద్) ఓ మధ్యతరగతి ఉద్యోగి. బైక్ కొనిచ్చే స్తోమత తనకు లేదని తెగేసి చెబుతుంటాడు. అదే కాలేజీలో చేరిన పూజ (అక్ష)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే అర్జున్ దగ్గర బైక్ లేకపోవడంతో పూజ వేరేవాళ్ల బైక్ లో లిఫ్ట్ తీసుకుంటూ ఉంటుంది. దీంతో బైక్ సొంతం చేసుకోవాలనే కోరిక అర్జున్ కు మరింత బలపడుతుంది. మహేష్ (తనీష్) బికామ్ విద్యార్థి. చదువుకు తగ్గట్టే అతను బీకామ్ (నెమ్మదస్థుడు). తండ్రి రిటైర్ కావడంతో కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ వేటలో పడతాడు. కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్ సుబ్బు భాయ్ అంబానీ (బ్రహ్మానందం)ని బుట్టలో వేసుకుని కలెక్షన్ ఏజెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే ఈ ఉద్యోగానికి సొంతబైక్ తప్పనిసరి. తల్లి దాచి ఇచ్చిన డబ్బులతో మహేష్ ఓ బైక్ కొంటాడు. ఒకరోజు తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే మందులు కొనేందుకు బైక్ ను షాపు ఎదుట పార్కింగ్ చేసి తిరిగి వచ్చేసరికి ఆ బైక్ మాయమవుతుంది. దాంతో మహేష్ షాక్ తింటాడు. బైక్ లేకపోతే ఉద్యోగానికి రానవసరంలేదని మేనేజర్ తేల్చిచెప్పేస్తాడు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోతుంది. బైక్ కోసం వెదుకుండగా తన బైక్ పైనే పూజతో కలిసి వెళ్తున్న అర్జున్ ను చూస్తాడు. బైక్ తనదంటే తనదని ఇద్దరూ రక్తాలొచ్చేలా కొట్టుకుంటారు. నిజానికి... బైక్ రైడింగ్ పోటీల్లో పాల్గొని గెలుచుకున్న సొమ్ముతో ఆ బైక్ ను సెకెండ్ హ్యాండ్ మార్కెట్ లో అర్జున్ కొంటాడు. దీంతో బైక్ విషయంలో ఎవరి వైపు మాట్లాడినా మరొకరికి అన్యాయం జరుగుతుందని భావించిన మిత్రులంతా ఆ ఇద్దర్నే తేల్చుకోమంటారు. ఒకరికి బైక్ ఇష్టమైతే...మరొకరికి బైక్ అవసరం. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరూ ఎలాంటి అవగాహనకు వచ్చారు. అంతిమ పరిష్కారం ఏమిటనేది వెండితెరపైన చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది.