'నిన్ను కలిశాక' రివ్యూ
ప్రేమ అనేది సార్వజనీనం. అయితే ప్రేమ అనే కాన్సెప్ట్ చర్చకు వచ్చినప్పుడల్లా యువతీ యువకుల మధ్య పుట్టేదే ప్రేమ అనే అభిప్రాయం చాలాకాలంగా బలంగా పాతుకుపోయింది. ఈ అభిప్రాయాలను సిల్వర్ స్క్రీన్ ప్రేమలు ఎప్పటికప్పుడు సజీవం చేస్తూనే ఉన్నాయి. జనరేషన్లు మారినా ప్రేమకథా ఇతివృత్తాలకు ఆదరణ మాత్రం పాతపడలేదు. అయితే ఇవాల్టి జనరేషన్ ను నచ్చే ప్రేమకథా చిత్రాలు తీయడం కత్తిమీద సామే. ఇద్దరు యువతీ యువకులు కలిసి కనిపిస్తే అది ప్రేమే ఎందుకు కావాలి? స్నేహం కాకూడదా? అనే పాయింట్ నుంచి...ప్రేమకూ ఆకర్షణకూ మధ్య తేడాలను వివరించే కథాంశాల వరకూ ఇవాల్టి 'పోష్ అండ్ ఫాస్ట్' జనరేషన్ కోసం కథారచయితలు, ఫిల్మ్ మేకర్స్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి మరో ప్రయత్నమే 'నిన్ను కలిశాక'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తర్వాత అత్యధిక చిత్రాల నిర్మాణ సంస్థగా రెండో ప్లేస్ లో ఉన్న ఉషాకిరణ్ మూవీస్ నుంచి ఈ సినిమా రావడం, సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించడం, కొత్త తారలతో టీనేజ్ లవ్ స్టోరీ చిత్రం కావడం సహజంగానే ఆడియెన్స్ లో కొంత ఉత్సుకత నెలకొంది. కొత్త తారలతో ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన 'చిత్రం', 'నువ్వేకావాలి', 'ఆనందం', నిన్నమొన్నటి 'నచ్చావులే' చిత్రాలు హిట్ కావడం కూడా సెంటిమెంట్ పరంగా కలిసొచ్చే అంశం. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ఫలించే అవకాశం ఉందా? దర్శకుడు శివనాగేశ్వరరావు ఆడియెన్స్ అంచనాలను ఏమేరకు నిలబెట్టారనేది చూద్దాం...
అభిరామ్ (సంతోష్), దీప్తి (దీప షా) ఓ ప్రేమ జంట. చందు (చైతన్య), బిందు (ప్రియ) మరో ప్రేమ జంట. ఒక ఐ.టి.కంపెనీలో మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్ కోసం అభి న్యూయార్క్ విమానం ఎక్కుతాడు. బిందు కూడా అదే పనిమీద అదే ఫ్లయిట్ లో బయలుదేరుతుంది. ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడుతుంది. ఊహించని విధంగా ఇద్దరూ ఒకే కంపెనీకి పనిచేయాల్సి వస్తుంది. ఇద్దరూ పక్కపక్క రూమ్స్ లోనే ఉంటూ మంచి స్నేహితులవుతారు. మరోవైపు బిందు జ్ఞాపకాలను చందు నెమరవేసుకుంటూ ఉంటాడు. స్టేజ్ ప్లేలు అంటే అతనికెంతో ఇష్టం. ఒక సందర్భంలో అతనికి దీప్తి పరిచయమవుతుంది. ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ కూడా కావడంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కావచ్చేసరికి అభి, బిందు మధ్య స్నేహం క్రమంగా ఒకరికి మరొకరు బాగా దగ్గరయ్యేంత వరకూ వస్తుంది. తాము ప్రేమలో పడ్డామనే భావన ఇద్దరిలోనూ కలుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కావడంతో ఇద్దరూ బరువెక్కిన హృదయాలతో ఇండియాకు బయలుదేరుతారు. ఆ ఇద్దరూ తమ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియని సందిగ్ధం పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. అది నిజమైన ప్రేమేనా? గతంలో వారిద్దరూ వేర్వేరు వ్యక్తులను ప్రేమించినప్పుడు మళ్లీ ఈ కొత్త ప్రేమ వ్యవహారం ఏమిటి? నిజానికి ఏది నిజమైన ప్రేమ? ఏది ఆకర్షణ? చివరకు ఈ రెండు ప్రేమజంటల కథకు ఎలాంటి ముగింపు దొరికిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|