చింటూ (ప్రభాస్) ఓ అనాథ. చిన్నప్పుడే చిదంబరం (మకరన్ దేశ్ పాండే) అనే ఓ క్రిమినల్ చింటూని తల్లిదండ్రుల నుంచి ఎత్తుకుపోతాడు. చిన్నపిల్లల్ని బిచ్చగాళ్లుగా చేసి ఆ సంపాదనతో బతికేస్తుండాడు చిదంబరం. అలాంటి చిదంబరంను ఆరేడేళ్ల ప్రాయంలోనే చింటూ పోలీసులకు పట్టిచ్చేస్తాడు. అందుకు చింటూకు ఓ పోలీసు ఇచ్చిన రివార్డు ఓ రూపాయి. ఆ రూపాయే చింటూ కెరీర్ ను మార్చేస్తుంది. పెద్దయ్యాక 'బాంటీ హంటర్' అవతారమెత్తుతాడు. అంటే..వాంటెడ్ రికార్డ్స్ లో పోలీసులు రివార్డు ప్రకటించిన వ్యక్తులను పట్టుకుని వారికి అప్పగించే పని. ఎప్పటికైనా తన తల్లిదండ్రుల ఆచూకీ చిదంబరం ద్వారానే తెలుసుకుని వారికి చేరువకావాలని చింటూ తపిస్తుంటాడు. అతని అనాథ జీవితంలోకి మ్యూజిక్ టీచర్ సమీరా (కంగనా రనౌత్) ప్రవేశిస్తుంది. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు కైలాష్ (ముకుల్ దేవ్) అనే నేరస్థుడు జైలు నుంచి తప్పించుకోవడంతో అతను వాంటెడ్ లిస్ట్ లో ఉంటాడు. చింటూ అతని కోసం అన్వేషిస్తుంటాడు. వాంటెడ్ లిస్ట్ లో ఉన్న కైలాష్ ను ఎలాగైనా అంతం చేయాలని అతని బాస్ జానీ భాయ్ (సోనూసూద్) ఎదురు చూస్తుంటాడు. అసలు కైలాష్ ఎవరు? అతన్ని జానీ భాయ్ ఎందుకు చంపాలనుకున్నాడు? చింటూ, జానీ భాయ్ మధ్య గొడవేంటి? చివరకు చింటూ తన తల్లిదండ్రులను కలుసుకున్నాడా? అనేది మిగతా కథ.