'విలేజ్ లో వినాయకుడు'రివ్యు
దర్శకుడు సాయికిరణ్ అడవి ముఖ్యంగా హీరో-హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ను మలిచిన తీరు ప్రశంసనీయం. ప్రేమించిన వాడు స్థూలకాయిడైనా 'తను తనలాగే ఉండటమే నాకు ఇష్టం' అంటూ చివరివరకూ ఎక్కడా తగ్గని క్యారెక్టర్ హీరోయిన్ ది. ఎన్ని అవమానాలు ఎదురైనా తనను కోరుకున్న అమ్మాయి కోసం చివరి వరకూ ఎక్కడా సహనం కోల్పోకుండా సిన్సియర్ గా ప్రయత్నించే క్యారెక్టర్ హీరోది. పురాణాలను అపహాస్యం చేస్తుండటంపై 'రాముడు ఎగ్జిస్టెన్స్ ను ప్రశ్నించడమంటే మన ఉనికిని మనం ప్రశ్నించుకోవడమే అవుతుంది' అని దర్శకుడు ఓ సందర్భంలో చూపించిన తీరు ముదావహం. నడి మధ్యలో పడవ ఆగిపోయినప్పుడు గొడుగునే తెరచాపగా వాడి ఆ పడవను హీరో ఒడ్డుకు చేర్చే సన్నివేశం, బాంబూ (వెదురు) చికిన్ కు బొంగులో చికెన్ అంటూ అల్లిన ఎపిసోడ్, కొలస్ట్రాల్ టెస్ట్, తూర్పు రామాయణం- రాజోలు డాన్స్ ట్రూప్ వంటి సన్నివేశాలు హాయిగా నవ్విస్తాయి. పడవ నడిపే వ్యక్తితో ప్రధాన క్యారెక్టర్లను పరిచయం చేసి ఆ వ్యక్తి తోనే చివర్లో ఆయా పాత్రలకు ముగింపు ఇప్పించడం ద్వారా దర్శకుడు తగిన గ్రిప్ చూపించారు. అలాగే 'అహ నా పెళ్లంట' అనే పాటను చివర్లో వచ్చే టైటిల్ రోలింగ్స్ లో వాడుకున్న దర్శకనిర్మాతలు జంధ్యాలను గుర్తుపెట్టుకుని మరీ ఆయనకు ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు.
కృష్ణుడు సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలు ప్రదర్శించే పాత్రలో మరోసారి సహజనటన ప్రదర్శించాడు. చివరివరకూ తన భుజస్కంధాలపైన సినిమా నడిపించాడు. సూపర్ మేన్ గెటప్ లో చిన్నారుల మనసులను కూడా ఈసారి దోచుకున్నటే. ఆయన బాడీ లాంగ్వేజ్, సంభాషణలు పలికిన తీరు హాయిగా నవ్విస్తాయి. శరణ్య మోహన్ అందగా, చక్కటి నవ్వుతో అలరించింది. తొలి సినిమా అయినా తగిన హావభావాలతో చలాకీగా నటించింది.రావు రమేష్ ఇంతవరకూ చేయనటువంటి వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషించి
తన సత్తా చాటుకున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో తన తండ్రి రావుగోపాలరావును గుర్తు చేశారు. ప్రకాష్ రాజ్ ఛాయలు కూడా అక్కడక్కడా కనిపించాయి. ఆయన చేసిన సీరియస్ నటనలోనూ అడపాదడపా మంచి కామెడీ పండింది. పజిల్స్ భాస్కరంగా యండమూరి వీరేంద్రనాథ్ నటన కూడా ఇంప్రెసివ్ గా ఉంది. కావ్యను చూసుకునేందుకు వచ్చిన మిలట్రీ ఆఫీసర్ భరత్ రెడ్డి పాత్ర చిన్నదే అయినా తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు.
Read 6 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|