సత్య (ఇలియానా) నాలుగేళ్ల ప్రాయంలోనే యూరప్ వెళ్లి 14 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు స్వగ్రామం వెంకటాపురం వస్తుంది. అక్కడకు అడుగుపెట్టగానే ఆమె తండ్రి సింగమనాయుడి (నెపోలియన్) ప్రత్యర్థి అప్పలనాయుడు (ముఖేష్ రుషి) గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మున్నా (విష్ణు) వచ్చి ఆమెను కాపాడతాడు. తన కుమార్తెను కాపాడిన మున్నాకు సత్య తండ్రి ఆ ఇంట్లో ఆశ్రయమిస్తాడు. సత్యను ఆకట్టుకునేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తుంటాడు. సత్య అతన్ని ఆటపట్టిస్తూ ఆ తర్వాత అతని ప్రేమకు పచ్చజెండా ఊపుతుంది. అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో సత్య తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ (వెంకట్)తో యూరప్ పారిపోతుంది. ఓజో అలియాస్ ఓగిరాల జోగయ్య (మోహన్ బాబు) అనే మాఫియా డాన్ తమ్ముడే క్రిష్. యూరప్ చేరిన సత్య తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి యూరప్ కల్చర్ లో పెరిగిన తనకు ఇండియాలోని ఉమ్మడి కుటుంబాల కల్చర్ లో ఇమడటం ఇష్టం లేదనీ, ఇక తనను మరచిపొమ్మని చెబుతుంది. తాను ఇంటి నుంచి పారియేందుకే మున్నాను ఒక ఉపకరణంగా చేసుకున్నానని హేళనగా మాట్లాడుతుంది. ఆమెకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్న మున్నా యూరప్ బయలుదేరుతాడు. అసలు మున్నా ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? సత్యకు పాశ్చాత్య సంస్కృతి కంటే మన ఉమ్మడి కుటుంబాల్లోని ఆప్యాయాతానురాగాల విలువను తెలియజేసి తన ప్రేమను అతను ఏవిధంగా గెలిపించుకున్నాడనేది మిగతా కథ.