ఒకేసారి కాన్పు జరిగిన ఇద్దరు మహిళలలో ఒకరికి కవలలు పుడతారు. మరో బ్రాహ్మణ మహిళకు మృత శిశువు జన్మిస్తాడు. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఓ పెద్దావిడ సీక్రెట్ గా అప్పుడే పుట్టిన కవలల్లోని ఒకరిని మృత శిశువు స్థానంలో ఉంచుతుంది. అలా ఆ కవలలు చిన్నప్పుడే విడిపోతారు. ఒకరు అగ్రహారంలో పెరిగిన చారి (ఎన్టీఆర్) అయితే, మరొకరు సిటీలో తల్లిదగ్గరే పెరిగిన నరసింహ (ఎన్టీఆర్). ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చారి తన గురువైన భట్టు (బ్రహ్మానందం)తో కలిసి చారి పౌరోహిత్యం చేస్తుంటాడు. నరసింహ ఇన్ స్పెక్టర్ కావాలనుకుంటాడు. ఓ పోలీసు ఆఫీసర్ (సాయాజీ షిండే) ప్రోత్సాహంతో మాఫియా ముఠాల ఆటకట్టిస్తుంటాడు. భట్టు వయసు మళ్లిన బ్రహ్మచారి. బ్రాహ్మణ యువతి చంద్రకళ (నయనతార)ను చూసి మనసు పారేసుకుంటాడు. అయితే చంద్రకళ అతని శిష్యుడైన చారికి లైన్ వేస్తుంది. నరిసింహను పోలీస్ ఆఫీసర్ కూతురు నందు (షీలా) ప్రేమిస్తుంటుంది. మరోవైపు కలకత్తాలో ఉంటూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఓ మాఫియా డాన్ బాబాజీ (మహేష్ మంజ్రేకర్) నరసింహ ఆచూకీ కోసం ప్రయత్నించి ఎట్టకేలకు అతన్ని తన దగ్గరకు రప్పించుకుంటాడు. నరసింహ ఎవరు? అతన్ని అక్కడికి రప్పించడం వెనుక ఆ డాన్ 'మాస్టర్ ప్లాన్' ఏమిటి? చిన్నప్పుడే విడిపోయిన చారి-నరసింహ మళ్లీ ఎలా కలుసుకున్నారనేది మిగతా కథ.