'సీతారాముల కళ్యాణం' రివ్యు
తెలుగు సినిమా క(వ్య)థ చర్విత చర్వణం. కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తే ఎక్కడ చేతులు కాలుతాయోననే భయం ఫిల్మ్ మేకర్స్ చేతులు కట్టిపడేస్తుండొచ్చు. నలిగిన బాటలోనే నడవడం వల్ల ప్రేక్షకుడు మొనాటనీగా ఫీలవుతాడు. అయినా ఫిల్మ్ మేకర్స్ తమ బాట వీడటం లేదు. హైద్రాబాద్ లోనో, వైజాగ్ లోనే...కాలేజీ నేపథ్యంలోనో...మరో నేపథ్యంలోనో ఓ ప్రేమ జంటను చూపించి విశ్రాంతికి విడగొట్టి...హీరోయిన్ ను 'సీమ'కు కిడ్నాప్ చేయించి, హీరో ను అక్కడకు పార్సిల్ చేయించడం ఎన్నిసార్లో...ఎన్నిమార్లో. నిన్నటి 'ఆర్య-2'...సంక్రాంతి నాటి 'నమో వెంకటేశ' ఇదే లైన్స్ లో వచ్చాయి. వారం తిరక్కుండానే మళ్లీ రాయలసీమను 'లంక'ను చేసి జనం మీదకు వదిలితే అది 'సీతారాముల కళ్యాణం' అయి కూర్చుంది. మిథిలలో 'సీతారాముల కల్యాణం' జరిగినట్టు వాల్మీకి ఉవాచ. వెరైటీగా రామాయణంలోని పాత్రలనే ఇప్పుటి సినిమాలో సోషలైజ్ చేశారు. రాముడు, సీత, హనుమంతుడు, లంక...అంటే...రాయలసీమలో రావణాసురుడు లాంటి విలన్. నిజానికి ఇదే టైటిల్ తో (ట్యాగ్ లైన్ లేకుండా) ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్, బాలకృష్ణ మరో సోషల్ మూవీ జనాలకు సుపరిచితమే. ఇవాల్టి 'కళ్యాణా'నికి శ్రీకారం చుట్టిన దర్శకుడు ఈశ్వర్ ముందే మనం చెప్పుకున్న ఓల్డ్ క్లాసిక్ లోని బ్లాక్ అండ్ వైట్ క్లిప్పింగ్స్ ను టైటిల్స్ లో చూపించి...మళ్ల ఈశ్వరరెడ్డి చేత ఈ చిత్రాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి అంకితం చేయించి (రాజశేఖర్ రెడ్డి చివరిసారిగా క్లాప్ ఇచ్చిన చిత్రం ఇదే కావడం విశేషం) మంచి ఫీల్ తో అసలు కథాక్రమంలోకి తీసుకువెళ్లారు. ఇక నితిన్ బాక్సాఫీస్ హిట్ కోసం కొద్దికాలంగా చేయని ప్రయత్నం లేదు. మళ్లీ మళ్లీ జనాల ముందుకు వస్తున్నా ఈసారి మాత్రం కొద్దిపాటి ప్రత్యేకత ఉంది. నితిన్ పక్కన అందగత్తె హన్సిక వచ్చి చేరడం, తెలంగాణ మద్దతుదారుల సపోర్ట్ నితిన్ కు ఉన్నట్టు ఫీలర్లు బయటకు రావడం వంటివి సినిమాపై కొన్ని అంచనాలకు తావిచ్చింది. మరి 'కళ్యాణం' సుఖాంతమేనా? ఆ విశ్లేషణలోకి వెళ్తే...
చందు (నితిన్) ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్. గుండె నిండా ధైర్యం అతని సొంతం. అదే కాలేజీలో చేరిన తన జూనియర్ నందిని (హన్సిక)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అతని ప్రేమలోని సిన్సియారిటీ, భవిష్యత్ పట్ల ఉన్న ధీమా చూసి నందిని కూడా ప్రేమలో పడుతుంది. నందిని తండ్రి పెద్దిరెడ్డి (సుమన్) ఓ ఫ్యాక్షనిస్టు. ఆళ్లగడ్డలో అతనికి ఓ ప్రత్యర్థి (జయప్రకాష్ రెడ్డి) ఉంటాడు. అతని తమ్ముడు కొడుకు వీరప్రతాప్ రెడ్డి (సునీల్ పాండా) నందినిపై మనసు పడతాడు. అతని పెళ్లి ప్రతిపాదనను పెద్దిరెడ్డి నిరాకరిస్తాడు. దీంతో నందినిని వీర ప్రతాప్ రెడ్డి తన మనుషులతో బలవంతంగా సీమకు ఎత్తుకు వస్తాడు. అది తెలిసిన చందు ఆమెను కాపాడేందుకు సీమలో అడుగుపెడతాడు. రావణాసురుడు లాంటి వీరప్రతాప్ రెడ్డి చెర నుంచి నందినిని అతను ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా కథ.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|