పాత కళాఖండాల జోలికి వెళ్లరాదనేది కొందరి నిశ్చితాప్రాయం కావచ్చు. అయితే పాత సినిమాల 'భాండాగారం'లో నేటికీ ఎన్నో కళాఖండాల జాడ లేదు. అవి ఎక్కడున్నడో...ఏ దశలో ఉన్నాయో కూడా ఆచూకీ కూడా దొరకడం లేదని పరిశోధకులు వాపోతున్నారు. ఈ తరుణంలో సినీ స్వర్ణయుగంనాటి చిత్రరాజాలను వెలికితీసి ఇవాల్టి టెక్నాలజీకి అనుసంధానించి వాటిని నిత్యనూతనం చేయాలనే గోల్డ్ స్టోన్ తొలి ప్రయత్నం శ్లాఘనీయం. ఎటొచ్చీ ఏభై ఏళ్లుగా జనంతో మమేకమైన 'మాయాబజార్' చిత్రం నుంచి రెండు పాటలు తొలగించడం నిస్సందేహంగా బాధాకరం. మరో బాధాకరమైన విషయం...ఈ చిత్రం కలర్ ప్రక్రియలో మనముందుకు వచ్చే సరికి అక్కినేని నాగేశ్వరరావు, మిక్కిలినేని మినహా దర్శకనిర్మాతలతో సహా ప్రధాన పాత్రధారులంతా కాలం చేశారు. అయితే కళాకారులకు ఓ గొప్పవరం ఉంది. కళ బతికున్నంత వరకూ కళకారుడు చిరంజీవే. ఆ మాటను నిజం చేస్తూ రంగుల 'మాయా' బజార్ ఇప్పుడే షూటింగ్ ముగించుకుని కలర్ లోనే తీశారమోనన్నంత చక్కటి అనుభూతిని కలిగించడం ద్వారా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకు వెళ్తుంది. 'సింప్లీ సూపర్బ్' అనడం చిన్నమాటేమో?!