దర్శకుడు కిరణ్ ఒక మంచి ఎంటర్ టైనర్ ఇవ్వాలనే ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినా...నేరేషన్ పరంగా తికమక పెట్టడం కనిపిస్తుంది. ఉదాహరణకు ఓ దశలో నీ పెళ్లాం ఏది అని రమ్మీని ఎసిపి అడుగుతాడు. ఆ వివరాలు చెప్పిన రమ్మీ...అ తర్వాత క్రమంలో ఆమె నా భార్య అని నేను చెప్పానా అని ఎసిపిని ఎదురు ప్రశ్నిస్తాడు. రమ్మీ చెప్పిన 'ఆ..ఆమె'కు ఇంకో ఫ్యాష్ ఉంటుంది. ఆమె చేతే ఇది చెప్పిస్తారు. అందులో ఆమెకు పెళ్లయి ఓ పిల్లాడు ఉంటాడు. ఇలాంటివి సగటు ప్రేక్షకుడికి భారమైన ట్విస్ట్ లు అవుతాయి. హీరో చిన్నప్పుడు అలా మారడానికి కారణం తన తండ్రి అని చూపించి ఆ తర్వాత ఆ తండ్రి అతీగతీ ఏమైందో దర్శకుడు పట్టించుకోలేదు. అలాగే రెండు 'స్పైసీ సాంగ్స్' సినిమాలో ఉన్నప్పుడు వాటి ప్లేసింగ్ విషయంలో దర్శకుడు శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు. అనుష్క స్పెషల్ సాంగ్ మొదట్లోనే హఠాత్తుగా వచ్చిపడుతుంది. 'ము...మ్ము..ముద్దంటే చేదా' సాంగ్ కూడా ఆ వెంటనే సందర్భం లేకుండా వచ్చేస్తుంది. ఈ రెండూ ఫస్టాఫ్ లోనే చూపించడం వల్ల ప్రేక్షకులను చివరివరకూ కూర్చోబెట్టే అవకాశాన్ని కిరణ్ జారవిడుచుకున్నారు.
నాగార్జునను చూస్తే ఆయన వయసు హీరోలు అసూయపడాల్సిందే. ఆయన రోజురోజుకూ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ఎక్కడా ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా సింగిల్ హ్యాండ్ మీద సినిమాను నడిపించేశారు. మమతా మోహన్ దాస్ ఓ గ్లామర్ పీస్ గానే కనిపిస్తుంది. లవ్, ఎమోషన్స్ వంటివి మమతా మోహన్ దాస్ లో అంతగా పండలేదు. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ఇందుకు కారణమని అనుకోవచ్చు. చంద్ర పాత్రను అంకుర్ సునాయాసంగా పోషించారు. బాలీవుడ్ విలన్ల కోసం ఫిల్మ్ మేకర్స్ వెంపర్లాట అంకుర్ కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టొచ్చు. కెల్లీ డోర్జ్ ఒకే సన్నివేశంలో...ఒకే ఫైట్ కు పరిమితయ్యాడు. సాయాజీ షిండేకు ఇలాంటి పాత్రలు కొత్తకాకపోయినా అతని పాత్ర తరచు స్క్రీన్ పై కనిపించడం కొంతమేర అసహసం కలిగిస్తుంది. బ్రహ్మానందం ఎంట్రీ బాగానే ఉన్నా ఆ పాత్ర నుండి సరైన నవ్వులు రాలవు. నాగార్జున ఫ్రెండ్ గా హర్షవర్ధన్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన పాత్రల గురించి ప్రస్తావన అవసరంలేదు.