తెలుగు సినిమా ఇంతకాలం మనగలిగిందంటే ప్రేమకథా చిత్రాలే కారణమని ఓ సినీ ప్రముఖుడు ఇటీవల విశ్లేషించారు. ఇందులో కొంత నిజం కూడా లేకపోలేదు. అయితే 'ప్రేమ' అంటే యువతీ యువకుల మధ్య పుట్టిది మాత్రమేననే అభిప్రాయానికే ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండటం వల్ల అదే అభిప్రాయం యంగర్ జనరేషన్ లోనూ బలపడుతూ వస్తోంది. అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమంటే నమ్మకం అనేది కొందరి వాదన. ప్రేమంటే బాధ్యత అనేది మరికొందరి వాదన. ప్రేమించుకునేటప్పుడు అడ్డురాని అంతరాలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు భవిష్యత్ లో ఏమి సాధించదలచుకున్నారనే బాధ్యతలతో ముడిపెట్టడం సబబేనా? అసలు ప్రేమించుకునేటప్పుడు లేని లక్ష్యాలు కలిసి మనుగడ సాగించాలనుకున్నప్పుడు ఎందుకు పట్టిపట్టి చూస్తారు? యువతను ఎప్పటికప్పుడు ఆలోచించపజేసే ప్రశ్నలే ఇవి. బహుశా ఇక్కడే ప్రేమజంటలకూ, పెద్దవాళ్లకు మధ్య అనాదిగా సంఘర్షణ జరుగుతూనే ఉంది. ప్రేమించడం ఓ హక్కు అని యువకులు అనుకుంటే...కాలుకందకుండా చూసుకున్న ఆడపిల్లను జీవితంలో ఒక లక్ష్యమంటూ లేని వాళ్లకు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామనేది పెద్దవాళ్ల వాదన. అయితే ప్రేమ లేకుంటే ఎన్ని ఉన్నత లక్ష్యాలను టార్గెట్ చేసుకున్నా జీవితానికి అర్ధం లేదనేది కుర్రకారు వాదన. ప్రేమకథలు ఎప్పుడూ చరిత్వ చర్వణమే అయినే 'కరెంట్' చిత్రం ఇతివృత్తం కూడా ఈ లైన్స్ లోనే నడుస్తుంది. 'యువతీ యువకుల మధ్య లవ్ కరెంట్ పుడితే దానిని ఆ ప్రేమజంట జీవితాంతం మరిచిపోలేదు. ప్రేమికులు కలిసి జీవించాలనుకున్నప్పుడు కష్టమైనా సుఖమైనా జీవితాంతం కలిసే పంచుకోవాలి. ప్రేమకు అసలు సిసలైన అర్ధం ఇదే' అని దర్శకుడు సూర్యప్రతాప్ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆడియెన్స్ లో ఏమాత్రం వోల్జేట్ జనరేట్ అయింటుందనేది ఓసారి చూద్దాం.