'కేడి' రివ్యూ
తెలుగు సినిమా హీరోను ఉదాత్తంగా చూపించే రోజులకు కాలం చెల్లిపోయింది. హీరోను ఓ దొంగగానో, స్మగ్లర్ గానో, మాఫియా డాన్ గానో, కిరాయి హంతకుడుగానో సినిమా అంతా చూపించి హీరో అలా కావడం వెనుక పేదలను ఆదుకోవడమో, మరో ఉదాత్త అంశమో ఉందని చూపిస్తే ప్రేక్షకులు సంతృప్తి పడిపోతారనేది ఇవాల్టి ఫిల్మ్ మేకర్ల నమ్మకం. ఇలాంటి కథల వల్ల హీరోలను హీమాన్ లు గా...షీమాన్ లు గా కూడా ఫిల్మ్ మేకర్స్ చూపించి బోలెడన్ని మాస్ మషాలాలు నింపేయొచ్చు. చివర్లో ఓ భారీ క్లైమాక్స్ మాత్రం తప్పనిసరి. ఏ 'జీహీదీ'లో నగరంలో ఆర్డీఎక్స్ పేల్చివేత కుట్రలను హీరో భగ్నం చేసినట్టు చూపిస్తే అంతవరకూ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో మంచితనం ఏంటో జనాలకు అర్ధమైతోంది. గత తప్పిదాలకు శిక్ష పడుకుండనే హీరో బయటపడిపోవచ్చు. అదెలా? అని ఎవరైనా తర్కం చేస్తే అంతటి అమాయ ప్రేక్షకుడు మరోడు ఉండడు. తెలుగు సినిమా నడక చాలాకాలంగా ఇదే తరహాలో ఒకడుగు ముందుకు...మూడడుగులు వెనక్కి వెళ్తోంది. వెరసి రెండడుగులు వెనకడుగే. ట్రెండ్, దర్శకుల ఎక్స్ పీరియన్స్ ను నమ్ముకుని సినిమాలు చేయడం కంటే ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడే నాగార్జున ఈసారి సైతం 'కేడి'తో అలాంటి ప్రయోగమే చేసినప్పటికీ ఎంచుకున్న కథ మాత్రం పైన చెప్పుకున్న పంథాలోనే నడకసాగించింది. కమర్షియల్ ఫార్ములా కాబట్టి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ...ఎంచుకున్న కథనైనా 'పామర' జనానికి అర్ధమయ్యేలా చూడడం సదరు దర్శకుడి కనీస బాధ్యత. ముక్కు ఎక్కడుందంటే తలచుట్టూ చేయి చక్రంలా తిప్పి చూబెట్టినట్టు ఉండకూడదు. పోనీ మేము క్లాస్ అని చెప్పుకునే జనాలను దృష్టిలో పెట్టుకునైనా లవ్, ఎమోషన్స్ వంటి అంశాలనైనా సమర్ధవంతంగా డీల్ చేయాలి. హీరోయిన్ ను హీరోతో చూపించి ఆమెకు ఎప్పుడో పెళ్లయిపోయినట్టు ఆ తర్వాత వివరణ ఇప్పిస్తే ప్రేక్షకుడి ఉత్సుకత ఒక్కసారిగా నీరుగారిపోదూ? దర్శకుడు కిరణ్ కు ఇది తొలిచిత్రం కావడం ఇలాంటి అనుభవరాహిత్యం కనిపిస్తుంది. నాగార్జున డిసెంబర్ సెంటిమెంట్ తప్పడం, నాగచైతన్య హీరోగా పరిచయమైన తర్వాత నాగార్జున తొలిసారి ప్రేక్షకుల ముందుకు రావడం, కామాక్షి కళా మూవీస్ రజతోత్సవ కానుక కావడం ఈ చిత్రంపై సహజంగానే ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచింది. అందుకు తగినట్టుగా 'కేడి' విహారం సాగిందా అనేది చూద్దాం...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|